• దక్షిణ తెలంగాణ.. పాలమూరు యాస
పాలమూరంటేనే ఆరివారం. గా బాసంటే ఇంకా ముచ్చటేస్తది. ఎందుకంటే గీ బాసల మట్టి వాసన ఉంటది. మట్టి మనుషుల వాసన ఉంటది. ఎవరు ఏ బాస మాట్లాడినా మట్టి పరిమళం గుప్పుమంటది. అంత సచ్చగా ఉంటది గీ బాస. యాడబోయినా మనం ఇంటి బాసనే మాట్లాడతం. ఇంట్ల మాట్లాడే బాసనే బయట కుడ్క మాట్లాడ్తం. ఎందుకంటే మనది జీవబాస. జీవమున్న తెల్గు బాస. మనం మాట్లాడేదే అచ్చమైన తెల్గుబాస. యాడ తెల్గు బాస మాట్లాడినా గానీ యాస ఉంటది. కానీ మన పాలమూరు బాస సక్కగుంటది.
ఇంగ్లీషు బాస వచ్చినంక మన బాసకు దూరమైతున్నం. మన బాసే మనకు తెలియకుండపోవట్టె. ఒక్కొక్క కులంలో కుడ్క ఒక్కొక్క బాస ఉంటది. గవి కుడ్క మర్సిపోతున్నం. మన కులవృత్తుల బాస కుడ్క మనకు ఎర్క లేవట్టే. గా ఇంగ్లీషు మోజులో పడి మన తెల్గు బాసను మర్సిపోతున్నం. కమ్మగా ఉండే మన బాసకు దూరమైపోతున్నం. తెల్గుల మాట్లాడితే ఎంతో తియ్యగా ఉంటది. సాలా మంది ఎచ్చులకుపోయి ఇంగ్లీషుల మాట్లాడవట్రి. అమ్మబాసకు దూరం సేయవట్రి. ఇంకా తెల్గు బాస బత్కిందంటే పల్లెలున్నందుకే. పల్లెల్ల అందరూ మాట్లాడవట్టె. అందుకే తెల్గుబాస ఎల్గబట్టె. పల్లెల్లేకపోతే తెల్గుబాస ఎన్నడో మాయమై ఉంటుండె. గీ పాలమూర్ల సానా పదాలు పుట్టినయ్‌. గీడ మాట్లాడినన్ని పదాలు మరెక్కడా మాట్లాడరు.
మల్ల తెల్గుకు ఎల్గు రావట్టె..
మల్లగిప్పుడు తెల్గుబాసకు ఎల్గు రావట్టె. ముక్యమంత్రి తెలుగుబాస కోసం సాన కష్టవరవట్టె. తెల్గుల గడగడ మాట్లాడవట్టినందుకేమో తెలుగుబాసను అందరూ తప్పకుండా సదువుకోవాలనవట్టె. గందుకే ఒకటవ తరగతి నుంచి పన్నెండు తరగతి దాకా తెలుగుబాస కచ్చితంగా ఉండాలని జీవో తీయవట్టె. గంతేకాదు తెల్గుబాస ప్రపంచానికి తెలియజేయనింకె పెపంచ సభలు జేయవట్టె. పెపంచంల ఎక్కడున్న తెల్గువారందరూ రావాలని కోరవట్టె. మల్లొక్కసారి తెల్గుదీపాన్ని ఎల్గాలని సూడవట్టె. తెల్గును సిన్నసూపును సూడకుడ్దని సెప్పవట్టె. తెల్గుల సదివితేనే ఉద్యోగం ఉంటుందనిఅందరికీ సెప్పవట్టె. గందుకే పపంచసభలు జేయవట్టె.
‘దేస బాసలందు తెల్గు లెస్స’ అని మరొక్కసారి లోకానికి సెప్పవట్టె. బోర్డులన్నీ తెల్గులోనే రాయాలని ఆదేశాలు జారీ జేయవట్టె. గిన్ని జేసినంక తెల్గు బత్కదా? గందుకే ముక్యమంత్రి తెల్గు బత్కనింకె ఆపసోపాలు వడ్తున్నడు. తెల్గు తెల్గు అనుకుంటా పోరాడుతున్నడు. తెల్గుకు మంచిరోజులు రావాలని కోరుకుంటున్నడు. మర్సిపోయిన తెల్గును మల్ల కల్లముందు ఉండనింకె సానా కష్టపడుతున్నడు. తెలంగాణ తెల్గు ఎల్గిపోవాలని ఉబలాటవడ్తున్నడు. నిజంగనే ముక్యమంత్రి తెల్గు బత్కనింకె మంచి పన్లు చేస్తున్నడు. మన బాసను మర్సిపోకుండా యాది జేస్తున్నడు. మన పదాలను గుర్తు జేస్తున్నడు.
పాలమూరు పదాలు యాది జేసుకుందాం
మన ఇండ్లలో మాట్లాడే పదాలు మనకు గిన ఎర్కలేవు. గాళ్లు మాట్లాడుతుంటే మనం ఆచ్చర్యపోతం. గివి మనం మాట్లాడుకునే మాటలే కాని మనం మాట్లాడం. మన పాలమూరు జిల్లాల సాన పదాలు ఉండవి. ఉదారణకు గాజు, ఉసికె, సెలక, కీస, దొప్ప, లగ్గం, విసుర్రాయి, బొక్కెన, సర్వ, అలుగు, పిన్నీసు, పగ్గం, మోత్త, తువ్వాలు, కచ్చకాయ, సిండు, సిల్కు, గొల్లెం వంటి పదాలను పాలమూరులో సుత సానా వాడ్తరు. ఇంగ్లీసు బాస వచ్చినంక గివన్నీ మర్సిపోయినం.
ఇంగ్లీసులోనే మాట్లాడుతుండం. గందుకే ముక్యమంత్రి బాగా ఆలోసించి పతి ఒక్కరు తెలుగులనే మాట్లాడాలని పట్టువడుతుండ్రు. తెల్గులోనే సదవాలని సెప్పవట్టిండు. గిది అందరికీ నచ్చేదే. అందుకే తెల్గు కవులు, రచయితలు అందరూ ముక్యమంత్రిని మెచ్చుకుంటున్నరు. ఎప్పటి నుంచో మేము వర్లుతుంటే ఎవలు పట్టించుకోలే. గిప్పుడు నువ్వు పట్టించుకున్నందుకు సంతసమైతుందని జెప్పవట్టిండ్రు. తెల్గుకు మల్ల మంచిరోజులు వచ్చినవని ముర్సవట్టిండ్రు. జై తెల్గు, జైజై తెల్గు.
-డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, కవి, రచయిత
10-12-2017 02:15:38 ఆంధ్రజ్యోతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి