తెలంగాణ తొలి డిటెక్టివ్ నవలా రచయిత ఎవరో తెలుసా..?

పాలమూరు సాహిత్యంలో ఆణిముత్యాలనదగ్గ రచయితల్లో అగ్రగణ్యులు ఎదిరె చెన్నకేశవులు. కవిగా,కథా, నవలా, గేయ రచయితగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా, సహకార సంఘ ఉద్యమ నాయకుడిగా లబ్ధ ప్రతిష్టులు.తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రముఖంగా పేర్కొనదగినవారు ఎదిరె చెన్నకేశవులు.
మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆగస్టు15,1918 న బాలకృష్ణమ్మ,నారాయణమ్మ అనే దంపతులకు జన్మించారు. స్వయంకృషితో తెలుగు,ఆంగ్ల, ఉర్దూ భాషలలో తగు ప్రావీణాన్ని సంపాదించారు. విద్యార్థి దశలోనే ఈ మూడు భాషలలో వెలువడు దినపత్రికలకు విలేకరిగా పనిచేశారు.సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన గోలకొండ ద్వైవారపత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు. మిలాప్‌ హిందీ పత్రికకు పత్రినిధిగా కూడా కొంతకాలం పనిచేశారు.నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ప్రచురించే ‘నేత’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత సహకార సంఘం నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు. సహకార సమాచారం పత్రికకు సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత రంగంలో విశేష కృషిసల్పిన వారి గురించి ‘చేనేత ప్రముఖులు’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ‘సహకార సహజీవనం’ అనే వ్యాససంపుటిని వెలువరించారు.
ఎదిరె చెన్నకేశవులు మొదటగా గోపాలపేట సంస్థానంలోని హరిజన పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి వారి అభ్యున్నతికై పాటుపడ్డారు. ఎంతోమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు.
కథా రచయితగా : తెలంగాణ తొలితరం కథల్లో లబ్ధ ప్రతిష్టులు ఎదిరె చెన్నకేశవులు. చెన్నకేశవులు కథలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి.వీరి ‘అభ్యుదయ రచయిత’ అన్న కథ సుజాత పత్రికలో 1950లో మొదటగా అచ్చయింది.అనంతరం వ్రాసిన తొమ్మిది కథలతో ‘పొట్టకోసం’ అనే కథాసంపుటిని 1968లో వెలువరించారు. ఇందులో పర్యవసానం, కూలి వెంకన్న, ప్రతిఫలం,పొట్టకోసం, సహవాసం, ఉగాది, కార్మికులదేే గెలుపు, నీ కోసం, గుణపాఠం వంటి కథలున్నాయి.
నవలా రచయితగా:
ఎదిరె చెన్నకేశవులు కథకుడిగానే కాకుండా నవలా రచయితగా కూడా పేరెన్నికగన్నవాడు. తొలి తెలంగాణ డిటెక్టివ్‌ నవలారచయితగా ఎదిరే చెన్నకేశవులు లబ్ధ్ద ప్రతిష్టులు. వీరి అదృశ్యహస్తం నవల తొలి తెలంగాణ అపరాధ పరిశోధక నవల. ఇది నేత వారపత్రికలో ధారావాహికంగా వెలువడి ప్రజాదారణ పొందింది. దొంగ, హంతకుడు అయిన భయంకర్‌ బారి నుంచి అతని మేనమామ కూతరును డిటెక్టివ్‌ మోహన్‌ కాపాడడం ఇందులోని ఇతివృత్తం. వీరి నవలలు పొట్టకోసం, పతిత ఈ రెండూ సాంఘిక నవలలు.
అదృశ్యహస్తం అపరాధ పరిశోధక నవల. నేత వారపత్రికల్లో 1967లో ధారావాహికంగా ప్రచురితమైంది.1969లో పుస్తక రూపంలో వెలువడింది. ఇది సీరియల్‌గా వస్తున్నప్పుడే పాఠకుల మన్ననలను పొందింది. అపరాధ పరిశోధక నవలకు ఉండవలసిన లక్షణాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందనే ఉత్కంఠ ఈ నవలలో అడుగడుగున తొంగిచూసింది.
ఎదిరె చెన్నకేశవులు రచించిన రెండవ నవల పొట్టకోసం. ఈ నవల 1969లో ప్రచురించబడింది. ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలసపోయి ఎలా జీవిస్తున్నారనే అంశంగా దీనిని రచించారు. రచయిత మూడవ నవల పతిత. ఇది 1970లో సహకార సమాచారం అనే వారపత్రికలో సీరియల్‌గా వెలువడింది. ఒక సినిమా నటి జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఈ నవల రాయబడ్డది.
జర్నలిస్ట్‌గా:
గోలకొండ పత్రికలో చెన్నకేశవులు పనిచేస్తున్నప్పుడే ఆనాటి నిజాంకాలం నాటి ప్రజల పరిస్థితుల గురించి, గ్రంథాలయోద్యమం గురించి మొదలైన అంశాలపై గోలకొండ, నేత వంటి పత్రికలలో పలు వ్యాసాలను ప్రచురించారు. జర్నలిస్టుగా, రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న ఎదిరే చెన్నకేశవులు ఆంధ్ర సారస్వత పరిషత్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శిగా, ఆంధ్రమహాసభ జిల్లా సంయుక్త కార్యదర్శిగా, రాష్ట్ర గ్రంథాలయ సంఘ వ్యవస్థాపక కార్యదర్శిగా,హైద్రాబాద్‌ కేంద్ర చేనేత సహకార సంఘానికి ప్రధాన వ్యవస్థాపకుడిగా పలు సేవలను అందించారు. హైదరాబాద్‌ రాష్ట్ర చేనేత ఉద్యమ ముఖ్యనాయకులలో ఒకరుగా, సర్వోదయ కార్యకర్తగా ప్రజోద్యమ నాయకుడిగా, వివిధ సంస్థల బాధ్యుడిగా పనిచేసిన నిరంతర శ్రమజీవి.
గేయకవిగా:
ఎదిరె చెన్నకేశవులు గేయకవిగా కూడా ప్రసిద్ధులు. వీరి రాసిన పలు గేయాలను ‘అర్పణ, అందరి గొడవ’ పేర్లతో తీసుకొచ్చారు. అయితే అర్పణ అనువాద గేయ సంపుటి. ‘నన్నిలా ఉండనీ’ అనే వచన కవితా సంపుటిని కూడా చెన్నకేశవులు రచించారు. అయితే ప్రసిద్ధ ఉర్దూ కవయిత్రి శ్రీమతి బాను తాహరా సయీద్‌ బేగం ఉర్దూ భాషలో రాసిన గేయ సంపుటి అనువాదమే ఈ అర్పణ. బాబా భక్తబృందంలో ఈమె ఒకరు. సత్యసాయిబాబా భక్తి భావంతో ఆమె ఎన్నో మధురగేయాలను రచించారు. ఈ అర్పణ గేయ సంపుటిలో ఎక్కువగా సత్యసాయిబాబా మీద రాసిన గేయాలున్నాయి. గజల్‌ , నజమ్‌ ఫక్కీలలో ఈ గేయాలను రచించారు. వివిధ భక్తులలో ఆత్మ నివేదన ఒకటి. బాను తహరా ఆత్మ నివేదనకు అక్షర రూపమే ఎదిరె చెన్నకేశవులు అనువదించిన అర్పణ గేయ సంపుటి. ఉర్దూ మూలంలోని భావాలను తెలుగులో శక్తివంతంగా అనువదించడం విశేషం. ఈ అర్పణలో మొత్తం 26 గేయాలున్నాయి. ఎదిరె చెన్నకేశవులు మూలంలోని భావాలను యాధాతథంగా అనువదించడం విశేషం.
ఈ గేయాల్లో సర్వసంగ పరిత్యాగి అయిన సత్యసాయిబాబా మధుర భాష శ్రవణం, దివ్య రూప స్మరణం ల గురించి రాసిన గేయాలు రచయిత భక్తి తత్పరతను తెలియజేస్తాయి.
నా ప్రాణదాతవు నీవే
నా హృదయ మూర్తివి నీవే
అంటూ తన సర్వస్వం బాబానే అంటూ కీర్తిస్తారు.
భగవంతుడితో భక్తుడు తన నివేదనను ఆర్తితో పలికిన గేయాలెన్నో ఇందులో ఉన్నాయి. భాగవంతుడిని ఒక మిత్రుడిగా, ప్రేమికుడిగా,సన్నిహితుడిగా భావించి రాసిన గేయాలు మనకు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గీతాంజలిని తలపిస్తుంది.మొదటి గేయం హృదయవాణిలో
తారల్లో నిను చూచి తారసిల్లాను
వసంతంలో వెదకి వసుధ గాంచాను
నీ చూపు నా చూపు కలిసినప్పటి నుండి
నేనెచట నుంటినో నే నెరుగనైతి
అనుభూతి ప్రధానంగా రచించబడ్డ ఆత్మాశ్రయ గేయమిది. ప్రేమకు ప్రతీకగా ఈ గేయరచన సాగింది.
భగవంతుడిని స్నేహితుడిగా భావిస్తూ రాసిన గేయం అత్యంత స్నేహ మధురిమను వెల్లడిస్తుంది.
నా హృదయమెంతో కలవరపడుచున్నది నేస్తం
నా హృదయ స్పందన శబ్దం నీ చెవిలో
గింగురుమనలేదా నేస్తం
నా ఏకాంతం నా దు:ఖం
నా ఆందోళన నీకు తెలియనివికావు
అంటూ హృదయం పడే ఆవేదనను ఈ గేయంలో ఎదిరె చెన్నకేశవులు భావుకతతో వెల్లడించి మన మనసులను దోస్తారు.
ఇంకా…
నీ ఉపదేశాలే ప్రేమను నేర్పాయి. నాకు ఈ ఇల
నీ సందేశాలే నాలో జీర్ణించాయి ఈ ఇల
అంటూ సత్యసాయిబాబా ఉపదేశాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పారు. ఎదిరె చెన్నకేశవులు చక్కని అనువాదానికి నిదర్శనం ఈ అర్పణ గేయ సంపుటి కావ్యం.
డా|| భీంపల్లి శ్రీకాంత్‌  నమస్తే డెస్క్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి